Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా, ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బస్సు ఆదిలాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జి మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నేరుగా వాగులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికుల్లో చాలామందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు.
స్థానికులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారందరినీ వెంటనే ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. అతివేగమా లేదా బస్సులో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
