Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో (Mar-a-Lago) రిసార్టులో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. గన్ తో అక్రమంగా లోపలికి చొరబడేందుకు ప్రయత్నించిన ఆస్టిన్ టకర్ మార్టిన్ (21) అనే యువకుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఆదివారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు.
అసలేం జరిగింది?
నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ మార్టిన్, తన కారులో రిసార్ట్ వద్ద ఉన్న అత్యంత పటిష్టమైన భద్రతా జోన్‌లోకి దూసుకెళ్లాడు. అతని వద్ద ఒక షాట్‌గన్ – గ్యాస్ కాన్ ఉన్నట్లు ఏజెంట్లు గుర్తించారు.
భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని ఆయుధాలను కింద పడేయాలని ఆదేశించారు. అయితే, నిందితుడు గ్యాస్ కాన్‌ను పక్కన పడేసి, షాట్‌గన్‌తో ఏజెంట్లపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. పరిస్థితిని గమనించిన ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు , ఒక స్థానిక పోలీసు అధికారి వెంటనే స్పందించి ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మరణించాడు.
ట్రంప్ ఎక్కడ ఉన్నారు?
ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతని భార్య మెలానియా ట్రంప్ ఇద్దరూ రిసార్ట్‌లో లేరు. వారు ఆ సమయంలో వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లోనే ఉన్నారని అధికారులు వెల్లడించారు. నిందితుడు గత కొన్ని రోజులుగా ఇంటి నుండి కనిపించకుండా పోయాడని, అతని కుటుంబ సభ్యులు ఇప్పటికే మిస్సింగ్ కేసు పెట్టారని విచారణలో తేలింది.
ఎఫ్‌బీఐ దర్యాప్తు ముమ్మరం
ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగింది. నిందితుడు కేవలం భయాందోళనలు సృష్టించడానికి వచ్చాడా లేదా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నాడా అనే కోణంలో FBI దర్యాప్తు చేస్తున్నారు.
మార్-ఏ-లాగో పరిసరాల్లోని నివాసితులు తమ ఇంటి సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి కారు కదలికలు ఏవైనా ఉంటే పోలీసులకు అందించాలని కోరారు.గతంలో కూడా ట్రంప్‌పై హత్యాయత్నాలు జరిగిన నేపథ్యంలో, రిసార్ట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
