AP Inter Exams 2026

AP Inter Exams 2026: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

AP Inter Exams 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి (ఫిబ్రవరి 23, 2026) ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ప్రథమ(ఫస్ట్  ఇయర్) సంవత్సర విద్యార్థులకు, మంగళవారం ద్వితీయ సంవత్సర(సెకండ్ ఇయర్ ) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, వారి కోసం అధికారులు 1537 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుంది.

ఒక్క నిమిషం నిబంధన.. గంట ముందే చేరాలి!

పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది.

పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు కనీసం గంట ముందే తమ కేటాయించిన సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.

పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.

ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సిసి కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని నేరుగా ఇంటర్ బోర్డు కార్యాలయాలకు అనుసంధానించారు. అలాగే సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాపై ప్రత్యేక దృష్టి

గత ఏడాది (2025) రాష్ట్రంలోనే అత్యధికంగా 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేశారు.

ఈ జిల్లాలో సుమారు 1,02,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వీరి కోసం 150కి పైగా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 56 వేల మంది ఫస్టియర్, 46 వేల మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.

విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు

ఎండల తీవ్రత మొదలవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక వసతులు కల్పించారు.

 ప్రతి సెంటర్ వద్ద చల్లని తాగునీరు మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచారు.

కాపీయింగ్ జరగకుండా అడ్డుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు.

విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి ఇంటర్ బోర్డు 1800 425 1531 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని అధికారులు మరియు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *