Ramchander Rao: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇటీవల రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘర్షణల్లో బాధితులను పరామర్శించేందుకు ఆయన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన వెళ్తే అక్కడ పరిస్థితులు మరింత ఉధృతమవుతాయని భావించిన పోలీసులు, ముందుగా తార్నాకలోని ఆయన నివాసం వద్దే గృహ నిర్బంధం చేశారు.
పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా రామచందర్రావు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మొదలైంది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. శాంతిభద్రతల దృష్ట్యా రామచందర్రావుతో పాటు మరికొందరు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యంలో పర్యటనలను అడ్డుకోవడం సరికాదని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రామచందర్రావు నివాసం ఉన్న తార్నాక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. బాన్సువాడ ఘటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
