Etela Rajender: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను పోలీసులు శనివారం ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించేందుకు, ఆయన్ను పరామర్శించేందుకు ఈటల కామారెడ్డి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన పర్యటన వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఈటల నివాసానికి చేరుకొని ఆయన్ను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అణచివేత ధోరణేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ఈటల కాంగ్రెస్ పార్టీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గుండాయిజం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజా పక్షాన పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఈటల నివాసం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
