Heritage Foods Legal Notice to Botsa

Heritage Foods Legal Notice to Botsa: హెరిటేజ్ పరువునష్టం నోటీసు.. బొత్స సత్యనారాయణకు చిక్కులు

Heritage Foods Legal Notice to Botsa: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘నెయ్యి’ సెగలు ఇంకా చల్లారడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య – నిరాధార ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ సంస్థ తరపున న్యాయవాది జి. మల్లిఖార్జున్ రావు ఈ నోటీసులను బుధవారం పంపారు.

ఆరోపణలు – వాస్తవాలు: హెరిటేజ్ వివరణ

తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి సేకరణలో హెరిటేజ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సంస్థ తీవ్రంగా మండిపడింది.

2014-2019 మధ్య కాలంలో మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని బొత్స చేసిన ఆరోపణలను సంస్థ తోసిపుచ్చింది. తమకు ఆ డెయిరీతో నెయ్యి సరఫరాకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవని స్పష్టం చేసింది.

22 ఇతర సంస్థలతో కలిసి హెరిటేజ్ సిండికేట్‌గా ఏర్పడిందని చేసిన వ్యాఖ్యలు కూడా పూర్తిగా వాస్తవ విరుద్ధమని నోటీసుల్లో పేర్కొన్నారు.

చట్టపరమైన చర్యల హెచ్చరిక

భారత న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 356 ప్రకారం పరువు నష్టం కలిగించినందుకు సమాధానం చెప్పాలని హెరిటేజ్ డిమాండ్ చేసింది.

తాము చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బొత్సను కోరింది.

ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో ఆయనపై సివిల్ – క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

రాజకీయ ఉత్కంఠ

దశాబ్దాలుగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్న తమ సంస్థపై కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హెరిటేజ్ పేర్కొంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా నెయ్యి సేకరణ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, ఇందులో మెజారిటీ వాటా కర్ణాటకకు చెందిన ‘నందిని’ సంస్థదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *