Re-Release

Re-Release: రజినీకాంత్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా రీ-రిలీజ్.. వద్దు అంటూ అభిమానుల ఆవేదనా?

Re-Release: ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ‘రీ-రిలీజ్’ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలను మళ్ళీ విడుదల చేస్తే ఇప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘ఆరెంజ్’, ‘బాబా’ వంటి సినిమాలు ఇందుకు నిదర్శనం. అయితే ఇదే ఉత్సాహంతో రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటైన ‘కొచ్చడయాన్’ (తెలుగులో విక్రమసింహ) ను మళ్ళీ థియేటర్లలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమాను ఏఐ (AI) టెక్నాలజీతో అప్‌డేట్ చేసి ఒక టీజర్‌ను విడుదల చేశారు.

ప్రమోషన్ల హంగామా.. అవుట్‌పుట్ డ్రామా

2014లో ఈ సినిమా విడుదలైనప్పుడు దీనిపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉండేవి. రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించడం, ఇండియాలోనే మొదటి మోషన్ క్యాప్చర్ మూవీ కావడం, హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ రేంజ్‌లో ఉంటుందని ప్రచారం చేయడం అందరినీ ఆకర్షించింది. కానీ, సినిమా విడుదలయ్యాక అందులోని గ్రాఫిక్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. రజినీకాంత్ లాంటి మాస్ హీరోను బొమ్మలా చూడలేక జనం ఈ సినిమాను తిరస్కరించారు.

ఏఐ టీజర్‌పై వెల్లువెత్తుతున్న ట్రోల్స్

12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే సినిమాను ఏఐ సహాయంతో మెరుగుపరిచామని టీమ్ చెబుతోంది. కానీ కొత్త టీజర్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు.

టీజర్‌లో రజినీకాంత్ డైలాగులు చెబుతున్నప్పుడు ముఖంలో ఎలాంటి కదలికలు లేవని, 12 ఏళ్ళ క్రితం వచ్చిన వెర్షన్ దీనికంటే నయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఏఐ వాడి సినిమాలను నాశనం చేయవద్దని, రజినీకాంత్ ఇమేజ్‌ను దెబ్బతీయవద్దని ఫ్యాన్స్ నిర్మాతలు కోరుతున్నారు.

ఫ్యాన్స్ డిమాండ్: ‘బాషా’ కావాలి గానీ ‘బొమ్మలు’ వద్దు!

రీ-రిలీజ్ చేస్తే ‘బాషా’, ‘పడయప్పా’, ‘అన్నామలై’ వంటి మాస్ బ్లాక్ బస్టర్లను డిజిటల్ వెర్షన్‌లో తీసుకురండి గానీ, మాకు ఈ యానిమేషన్ బొమ్మలు వద్దు అంటూ అభిమానులు ఎక్స్‌ (X) వేదికగా ట్రెండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఏఐ వెర్షన్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తేనే సినిమా మొత్తం విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అది కష్టమేననిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *