Elon Musk: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అంతరిక్ష పరిశోధనల్లో మరో సంచలనానికి తెరలేపారు. భూమిపై ప్రస్తుతం ఎదురవుతున్న కృత్రిమ మేధ (AI) సవాళ్లకు పరిష్కారంగా నింగిలో భారీ డేటా సెంటర్లను నిర్మించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 10 లక్షల ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి పంపడమే లక్ష్యంగా సరికొత్త ప్రణాళికను వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు తన అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ (SpaceX) లో ఏఐ విభాగమైన ‘ఎక్స్ ఏఐ’ (xAI) ని విలీనం చేసి, ఐపీఓ (IPO) ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం భూమిపై ఉన్న డేటా సెంటర్లు ఏఐ కార్యకలాపాల కోసం భారీగా విద్యుత్తును వాటిని చల్లబరచడానికి (Cooling) కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఏఐ వాడకం మరింత పెరిగితే భూమిపై ఉన్న వనరులు సరిపోవని, అందుకే అంతరిక్షమే సరైన వేదికని మస్క్ భావిస్తున్నారు. అంతరిక్షంలో లభించే సమృద్ధిగా ఉండే సౌరశక్తిని ఉపయోగించి ఈ డేటా సెంటర్లను నిర్వహించవచ్చని, అక్కడ సహజంగానే ఉండే అత్యల్ప ఉష్ణోగ్రతలు కంప్యూటర్ చిప్‌లను చల్లబరచడానికి ఎంతో సహాయపడతాయని ఆయన వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రయోగించే 10 లక్షల ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి లేజర్ కాంతిపుంజాల (Laser links) ద్వారా అనుసంధానమై, ఊహించని వేగంతో సమాచారాన్ని బదిలీ చేయనున్నాయి.
Also Read: Group-1: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు
అయితే ఈ భారీ లక్ష్యంపై శాస్త్రవేత్తలు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్షం శూన్యం కావడం వల్ల భూమిపై కంటే చిప్‌లు త్వరగా వేడెక్కే (Overheating) ప్రమాదం ఉందని, వేడిని బయటకు పంపడానికి భారీ రేడియేటర్ ప్యానెల్స్ అవసరమవుతాయని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే స్టార్‌లింక్‌కు చెందిన సుమారు 10 వేల ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా లక్షల సంఖ్యలో ఉపగ్రహాలను చేర్చితే అంతరిక్ష వ్యర్థాలు పెరిగి, ఒకదానికొకటి ఢీకొనే (Collisions) ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమిస్తూ మస్క్ తన ‘స్పేస్ ఏఐ’ కలని ఎలా నిజం చేస్తారో చూడాలి.
