MLC Nagababu: జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో హిందూ ధర్మానికి, దేవాలయాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. గత ప్రభుత్వ పాలనలో అంతర్వేది రథం దగ్ధం కావడం, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు హిందూ మతం అంటే కేవలం కుతంత్రాలు చేయడం మాత్రమే తెలుసని, వారికి భక్తి కంటే రాజకీయాలే ముఖ్యమని నాగబాబు విమర్శించారు.
తాను ఒక గర్వించదగ్గ సనాతన హిందువునని చెప్పుకున్న నాగబాబు, ఇతర మతాలను కించపరచకుండా తన ధర్మాన్ని కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే అసెంబ్లీలో అర్చకుల తక్కువ జీతాల గురించి మాట్లాడానని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నాయకులు ప్రజలను మోసం చేయడంలో దిట్టలని, అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పి కాలయాపన చేశారే తప్ప, నిందితులను పట్టుకోవడంలో ఆసక్తి చూపలేదని దుయ్యబట్టారు.
వైసీపీ నాయకులకు ఇతరుల వ్యక్తిగత విషయాల మీద ఉన్న శ్రద్ధ, దేవుడిపై లేదని నాగబాబు ఎద్దేవా చేశారు. సినిమాల రివ్యూల గురించి మాట్లాడే నాయకులు, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం వారి వైఖరిని తెలియజేస్తుందని విమర్శించారు. తిరుమలలో గదుల ధరలు పెంచి సామాన్య భక్తులను వేంకటేశ్వరస్వామికి దూరం చేశారని, దర్శనాల విషయంలో వైవీ సుబ్బారెడ్డి కూరగాయల బేరంలా వ్యవహరించారని మండిపడ్డారు.
ముఖ్యంగా తిరుమల డిక్లరేషన్ అంశంపై మాజీ సీఎం జగన్‌ను నాగబాబు నేరుగా ప్రశ్నించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తులే డిక్లరేషన్‌పై సంతకం చేసినప్పుడు, జగన్ తాను అంతకంటే గొప్పవాడిని అని భావిస్తున్నారా అని నిలదీశారు. తిరుమల కొండల పవిత్రతను కాపాడటం మానేసి, ఇతర కొండలను ఆక్రమించి నాశనం చేయడానికి ప్రయత్నించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో హిందువులను చులకనగా చూశారని, ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని నాగబాబు స్పష్టం చేశారు.
హిందూ ద్రోహి వైసీపీ #NoGheeInTTDLaddu@JanaSenaParty pic.twitter.com/m6qMO3q60v
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 4, 2026
