Ibomma Ravi: తెలుగు సినీ ఇండస్ట్రీలో పైరసీతో సంచలనం సృష్టించిన ఐబొమ్మ సూత్రధారి ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవికి న్యాయస్థానంలో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ వారం శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
గతంలోనే రవి తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ, అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో రవి పైకోర్టును ఆశ్రయించారు. తనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ (CCS) పోలీసులు నమోదు చేసిన నాలుగు వేర్వేరు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ గత నెల 21న హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం జరిగిన విచారణలో, ఈ కేసులో ఒక సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, అందుకు కొంత సమయం కావాలని రవి తరఫు లాయర్ కోరడంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
సినిమా పైరసీ ప్రపంచంలో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన రవిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. విదేశీ సర్వర్లను వాడుతూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని, చివరకు ఒక చిన్న టెక్నికల్ ఆధారంతో పోలీసులు పట్టుకోగలిగారు. కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించడమే కాకుండా, సినీ పరిశ్రమకు భారీ నష్టం చేకూర్చారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం జరగబోయే విచారణపైనే ఉంది; హైకోర్టు రవికి బెయిల్ ఇస్తుందా లేక రిమాండ్ పొడిగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
