బడ్జెట్ పై విమర్శలు.. రాహుల్ గాంధీకి నిర్మలమ్మ కౌంటర్

కేంద్ర బడ్జెట్ 2026పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పార్లమెంటులో తన వరుసగా 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు చాలా బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, సామాన్యులను ఆ ఒడిదుడుకుల నుంచి రక్షించేలా బడ్జెట్‌లో పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కోరిన “కోర్సు కరెక్షన్” (దిద్దుబాటు చర్యలు) అనే మాటలకు అర్థం లేదని, ఆయన ఏ ప్రాతిపదికన ఆ విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను తట్టుకునేందుకు వీలుగా ఎంఎస్ఎంఈలు, టెక్స్‌టైల్స్, లెదర్, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టామని నిర్మలా సీతారామన్ వివరించారు. రైతులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తల జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు. రాజకీయంగా విమర్శలు చేయడం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ, విమర్శలు చేసే ముందు వాస్తవాలను, గణాంకాలను గమనించాలని ఆమె రాహుల్ గాంధీకి సూచించారు.

అంతకుముందు రాహుల్ గాంధీ తన ‘X’ ఖాతాలో స్పందిస్తూ.. ఈ బడ్జెట్ దేశంలోని అసలైన సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగం కుంటుపడటం, పెట్టుబడులు తరలిపోవడం, రైతుల కష్టాలను ఈ బడ్జెట్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు గుడ్డిగా వ్యవహరిస్తోందని, తక్షణమే ఆర్థిక విధానాల్లో మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. దేశ ఆర్థిక వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేయగా, ద్రవ్యలోటును 4.3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రకటనల్లో భాగంగా సూరత్ – దంకుని మధ్య ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, 20 కొత్త జాతీయ జలమార్గాల ఏర్పాటును ప్రకటించారు.

తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అలాగే చిరు వ్యాపారుల కోసం రూ. 10,000 కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ను ప్రకటించడం విశేషం. వైద్య రంగంలో సామాన్యులకు ఊరటనిస్తూ 17 రకాల క్యాన్సర్ నిరోధక మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించారు. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల చికిత్స వ్యయం తగ్గే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *