KCR: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు గంటగంటకూ మారుతున్న పరిణామాలతో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ఇప్పుడు నేరుగా గులాబీ బాస్ కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసింది.
కేసీఆర్ లేఖ – సిట్ తిరస్కరణ: విచారణకు హాజరు కావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ అధికారులకు ఒక లేఖ రాశారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అలాగే మున్సిపల్ ఎన్నికల పనుల్లో తీరిక లేకుండా ఉన్నందున తాను సిట్ కార్యాలయానికి రాలేనని తెలిపారు. అధికారులే తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వచ్చి విచారించాలని ఆయన కోరారు. అయితే, ఎర్రవెల్లికి రావడం కుదరదని స్పష్టం చేసిన సిట్, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ ఆయన ఇంటి గోడకు నోటీసులు అంటించింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు
హైకోర్టుకు కేసీఆర్? సిట్ అధికారుల దూకుడును అడ్డుకునేందుకు కేసీఆర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సిట్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో తనను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి నోటీసులు ఇస్తున్నారని, విచారణను కొంతకాలం వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ సీఎం విచారణకు హాజరవుతారా? లేక హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారా? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
