YS Jagan: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఒక మహిళా ఉద్యోగినిని ఎమ్మెల్యే లోబర్చుకున్నారని, ఏడాదిన్నర కాలంలో ఆమెకు ఐదుసార్లు అబార్షన్ చేయించారనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. బాధితురాలు స్వయంగా వీడియోలు విడుదల చేయడంతో ఈ వ్యవహారం ముదిరింది. అయితే, ఇవన్నీ కుట్రపూరితంగా చేసిన ‘డీప్ ఫేక్’ వీడియోలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారు. ఈ లోపు జనసేన పార్టీ కూడా దీనిపై విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరవ శ్రీధర్ అసలు మనిషేనా? అని నిలదీశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగినిని భయపెట్టి, అంత దారుణంగా వేధిస్తే.. సాక్ష్యాధారాలు బయటకొచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వెనకేసుకు రావడం ఏంటని ఆయన మండిపడ్డారు.
కేవలం అరవ శ్రీధర్ మాత్రమే కాకుండా, కూటమి ప్రభుత్వంలోని మరికొందరు ఎమ్మెల్యేల తీరును కూడా జగన్ ఎండగట్టారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్ల ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు ప్రయత్నించిందని, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు వచ్చినా కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, తప్పు చేసిన వారిని జైలుకు పంపాల్సింది పోయి చంద్రబాబు ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని జగన్ విమర్శించారు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఫిర్యాదు చేసిన మహిళనే జైలుకు పంపడం అన్యాయమని, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫోన్ సంభాషణలు, మంత్రి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సుల వ్యవహారాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రం ప్రస్తుతం ఆటవిక రాజ్యంలా మారిందని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని జగన్ హెచ్చరించారు.
