YS Jagan

YS Jagan: ఏపీ అప్పులపై వైఎస్ జగన్ గర్జన.. కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం, ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి, కరోనా వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేశామని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ అబద్ధాలని ఇప్పుడు తేలిపోయాయని జగన్ ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కేవలం రూ. 3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ. 2.73 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకే జమ చేశామని ఆయన వివరించారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా చూపడానికి సిద్ధమని సవాల్ విసిరారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు నిండకుండానే రూ. 3 లక్షల కోట్ల అప్పు చేసిందని, మరి ఆ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు. మద్యం దుకాణాలన్నీ అధికార పార్టీ అనుచరుల చేతుల్లోనే ఉన్నాయని, బెల్ట్ షాపుల ద్వారా సామాన్యులను దోచుకుంటున్నారని విమర్శించారు. గతంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రేట్లు డబుల్ అయినా ప్రభుత్వ ఖజానాకు పైసా రావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పాలన మొత్తం ‘జంగిల్ రాజ్’లా తయారైందని ఆయన విమర్శించారు.

చివరగా, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ‘ఫుట్‌బాల్’ ఆడినట్లు తన్నే రోజు దగ్గర్లోనే ఉందని జగన్ హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు అధైర్య పడొద్దని, రాబోయే ఒకటిన్నర సంవత్సరం పాటు తాను 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యే ఉంటానని ప్రకటించారు. గ్రామ స్థాయి కమిటీలను మరింత బలోపేతం చేసి, మళ్ళీ వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *