YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. 10-జన్‌పథ్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు, ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని, దీనివల్ల పేద కూలీల పొట్ట కొట్టే ప్రమాదం ఉందని ఆమె రాహుల్‌కు వివరించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేదలకు అండగా ఉండే ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి అనంతపురం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆ జ్ఞాపకార్థం, ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఏపీలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పోరాటానికి మద్దతుగా నిలవాలని రాహుల్ గాంధీని షర్మిల ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసిన షర్మిల, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
