Telangana: బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు మళ్లీ సొంత గూటికి మల్లుతున్నారా? బీఆర్ఎస్ లో ఉన్న స్వేచ్ఛ, రాజసం బీజేపీ, కాంగ్రెస్‌లో అనుభవించలేకపోతున్నారా? లేక అక్కడి నాయకత్వంతో పొసగ లేకపోతున్నారా? తగిన గౌరవం దక్కడం లేదా? ఏమైతేనేమి కానీ, మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? అంటే అరూరి రమేశ్ ఉదంతమే నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Telangana: వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Telangana: అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్న ఆయన తాజగా ఈ ఏడాది జనవరి 26న బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకే ఆయన తన అనుయాయులు, అభిమానాలు, కార్యకర్తలతో చర్చించారు. వరంగల్‌లో లేదా వర్ధన్నపేటలో జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో బీఆర్ఎస్లో చేరనున్నారు.
Telangana: అరూరి రమేశ్ బీజేపీకి రాజీనామా చేయడంతో మరికొందరిపై చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఓ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల అంశం తెరమీదికి వచ్చింది. ఇదే సమయంలో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చనీయాంశమైంది. ఆ నలుగురు బీఆర్ఎస్ కీలక నేతలతో తమ అభిమతాన్ని వెల్లడించినట్టు తెలిసింది.
Telangana: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజవర్గం నుంచి 2023లో పోటీ చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ పార్టీని వీడారు. బీజేపీలో చేరిన ఆయన 2024 లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బలమైన క్యాడర్ కలిగి ఉండి ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగిన సైదిరెడ్డి.. ఇప్పుడు అంతగా ప్రాధాన్యం లేకుండా ఉన్నారని బోధపడింది. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో మరో నేతను అధిష్టానం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఆ ఖాళీని భర్తీ చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ముఖ్యులతో ఆయన మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అరూరి రమేశ్ దారిలోనే పయనిస్తారని తెలుస్తున్నది.
Telangana: బీఆర్ఎస్ హయాంలో విప్‌గా కొనసాగిన గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. నాగర్ కర్నూలు జిల్లాకు బీఆర్ఎస్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రలోభాలకా, భవిష్యత్తును చూసుకున్నారో? ఏమో కానీ బీఆర్ఎస్ ను వీడి ఆయన కూడా బీజేపీలో చేరిపోయారు. అక్కడ ఎలాంటి ప్రాధాన్యం లేకపోగా, ఇక్కడ ఉన్న దర్జా, హవా కనిపించడం లేదని తెలిసిపోయింది. తొలుత బీఆర్ఎస్ పై గర్జించిన ఆయన తాజాగా పల్లెత్తి మాట కూడా అనలేకపోతున్నారు. దీంతో ఆయన కూడా అరూరి రమేశ్ దారిలో బీఆర్ఎస్లోకి పయనమయ్యారని గుసగుసలు.
Telangana: బీఆర్ఎస్లో దర్జా అనుభవించి, 2023లో ఎమ్మెల్యేలుగా గెలిచి తొలినాళ్లలోనే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. వీరిద్దరికీ సొంత నియోజకవర్గాల్లో అసలు కాంగ్రెస్ నేతలు కుంపటి పెట్టి కూర్చున్నారు. వీరిద్దరికీ నియోజకవర్గాల్లో ప్రాధాన్యం లేకుండా చేస్తూ, బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతూ ఇరుకున పెడుతున్నారు.
Telangana: ఏకంగా అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకింత ముందుకేసి బహిరంగంగా ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారు చేపట్టిన కార్యక్రమాలపై కొన్ని సందర్భాల్లో దాడుల, దౌర్జన్యాలకు దిగిన సందర్భాలు లేకపోలేదు. ఇటీవల గూడెం మహిపాల్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, అధిష్టానం కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చూస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకోవాలంటే ఇలాంటి నేతలను దూరం చేసుకోవడం కంటే దగ్గరికి తీసుకోవడమే మేలని భావిస్తున్నట్టు పరిణామాలు చెప్తున్నాయి.
