US

US: అమెరికాను కప్పేసిన మంచు తుఫాను.. 10 వేల విమానలు రద్దు!

US:  అమెరికాలో ప్రస్తుతం వీస్తున్న మంచు తుపాను (వింటర్ స్టార్మ్ ఫెర్న్) అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. టెక్సాస్ నుండి వర్జీనియా వరకు విస్తరించిన ఈ భీకర తుపాను ప్రభావంతో దాదాపు 11 రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాతావరణ శాఖ గత నాలుగు రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, మంచు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 23 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ మంచు వర్షం మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత కూడా వారం రోజుల పాటు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల అమెరికాలోని సుమారు 20 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రభుత్వాలు సూచించాయి. ఇప్పటికే కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి వంటి రాష్ట్రాల్లో అధికారులు అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు. మంచు పేరుకుపోవడం వల్ల రహదారులు ప్రమాదకరంగా మారాయి, దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది.

Also Read: Puri Jagannadh: పెంగ్విన్ వైరల్ కథ.. పూరీ జగన్నాథ్ విషాద బ్యాక్ స్టోరీ!

విమానయాన రంగంపై ఈ తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. శనివారం 3,300 సర్వీసులు రద్దు కాగా, ఆదివారం నాటికి ఆ సంఖ్య దాదాపు 7 వేలకు చేరుకుంది. మొత్తంగా 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 25, 26 తేదీల్లో ఈ నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని సంస్థ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *