Ratha Saptami: శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యుడి జన్మదినం సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో, వేద మంత్రాల ఉచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ ఏడాది సూర్యజయంతి పర్వదినం ఆదివారం నాడే రావడం విశేషం కావడంతో, స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శనివారం రాత్రి నుంచే భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉండగా, అర్ధరాత్రి దాటాక 12:05 గంటల నుంచే ఉత్సవ కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది.
ముఖ్యంగా ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి మూలవిరాట్‌కు నిర్వహించిన మహా క్షీరాభిషేకం భక్తులకు కనువిందు చేసింది. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, నగేష్శర్మల నేతృత్వంలో వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా ఈ అభిషేక సేవను పూర్తి చేశారు. ఉదయం 7:30 గంటల వరకు ఈ పవిత్ర అభిషేక క్రతువు కొనసాగింది. అనంతరం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. ఏటా రథసప్తమి రోజున మాత్రమే లభించే ఈ అరుదైన నిజరూప దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు.
Also Read: Weekly Horoscope: ఈ వారం మీ ఉద్యోగ, వ్యాపార భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ కూడా ఆదిత్యుడిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలతో పాటు క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకే ఈ అద్భుత క్షేత్రంలో రథసప్తమి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలిచాయి.
