Bollywood : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విక్రమ్ భట్‌పై మరో భారీ మోసం కేసు నమోదైంది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.13.5 కోట్లు మోసం చేశారంటూ ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ భట్‌తో పాటు ఆయన కుమార్తె కృష్ణ భట్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును ఆర్థిక నేరాల విభాగం (EOW) విచారిస్తోంది.
ఫిర్యాదు వివరాల ప్రకారం, సినిమాలు మరియు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి విక్రమ్ భట్, ఆయన కుమార్తె తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని బాధిత వ్యాపారి ఆరోపించారు. పెట్టుబడులకు తగిన లాభాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది విక్రమ్ భట్‌పై నమోదైన మొదటి మోసం కేసు కాదు. గతంలో కూడా రూ.30 కోట్ల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఉదయ్‌పూర్ పోలీసులు ఆయనను మరియు ఆయన భార్య శ్వేతాంబరిని అరెస్ట్ చేశారు. ఇందిరా ఐవీఎఫ్ యజమాని డాక్టర్ అజయ్ ముర్దియా, తన భార్యపై బయోపిక్ తీస్తామని చెప్పి నిధులు సేకరించి మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
డాక్టర్ ముర్దియా తన ఫిర్యాదులో, రూ.7 కోట్ల పెట్టుబడితో నాలుగు సినిమాలు తీసి రూ.100 నుంచి 200 కోట్ల వరకు లాభాలు చూపిస్తామని విక్రమ్ భట్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కేసులో విక్రమ్ భట్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అదే సమయంలో ఆయనపై తాజాగా మరో మోసం కేసు నమోదు కావడం సినీ వర్గాల్లో మరియు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
