Gun Fire In USA: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఒక విషాదకర కాల్పుల ఘటనలో భారతీయ పౌరుడు మరణించినట్లు అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. లారెన్స్విల్లే నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ వివాదాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లోనే ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
క్విన్నెట్ కౌంటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులను మీము డోగ్రా (43), గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీష్ చందర్ (38)గా గుర్తించారు. నిందితుడిని అట్లాంటాకు చెందిన 51 ఏళ్ల విజయ్ కుమార్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ కుమార్ తన భార్య మీము డోగ్రాతో పాటు మిగిలిన ముగ్గురిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడిపై హత్య, దౌర్జన్యం, పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Gali Janardhan Reddy: రాజకీయ కక్షసాధింపా?..జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన దుండగులు
ఈ భయంకరమైన కాల్పులు ప్రారంభమైన సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు తమను తాము రక్షించుకోవడానికి ఒక అల్మారాలో దాక్కున్నారు. అందులో ఒక చిన్నారి ధైర్యం చేసి 911 (అత్యవసర విభాగం)కు కాల్ చేయడంతో, సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చే సమయానికి నలుగురు వ్యక్తులు బుల్లెట్ గాయాలతో మరణించి ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆ పిల్లలు సురక్షితంగా ఉన్నారని, వారిని కుటుంబ సభ్యులకు అప్పగించామని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల్లో ఒకరు భారతీయ పౌరుడు ఉన్నారని, మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నామని ‘X’ వేదికగా ప్రకటించారు. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు, కేసు దర్యాప్తులో స్థానిక అధికారులకు సహకరిస్తున్నట్లు వారు తెలిపారు.
