Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు వరుసగా నోటీసులు ఇస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ఇప్పుడు తన దృష్టిని కల్వకుంట్ల కుటుంబంపై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్ వంటి అగ్రనేతలను విచారించిన అధికారులు, తదుపరి జాబితాలో కల్వకుంట్ల కవిత పేరును చేర్చినట్లు సమాచారం.
తాజా పరిణామాల ప్రకారం, మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, అలాగే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. గతంలో తన భర్త ఫోన్లను ట్యాప్ చేశారంటూ కవిత స్వయంగా పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో, అసలు ట్యాపింగ్ ఎలా జరిగింది? ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? అనే కోణంలో వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, మరో రెండు మూడు రోజుల్లోనే వీరికి అధికారికంగా నోటీసులు అందే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి: Telangana: వాహనదారులకు గుడ్న్యూస్.. తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం ప్రారంభం!
ఈ దర్యాప్తు సాగుతున్న తీరును గమనిస్తే, సిట్ అధికారులు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంలోని కీలక సభ్యులందరినీ విచారించి, వారి దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించిన తర్వాత, చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ విచారణలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ఉత్కంఠను రేపుతున్నాయి.
