Skn: ప్రముఖ సినీ నిర్మాత SKN తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, సినిమాలు మరియు నటీనటులపై తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించి నెగెటివిటీ వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఉన్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒక సినిమా గురించి, అందులోని నటీనటుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SKN హెచ్చరించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ఖాతాలను నిర్వహిస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
