Komatireddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy: మా టార్గెట్ ఇదే.. తెలంగాణ అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వివరణ!

Komati Reddy Venkat Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఏస్ టెక్ 2026 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను వివరించారు. 2047 సంవత్సరం నాటికి మన రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని తెలిపారు.

హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దీనివల్ల యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు ఒక గేమ్ చేంజర్ కాబోతోందని కోమటిరెడ్డి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డును, రీజినల్ రింగ్ రోడ్డును కలుపుతూ మొత్తం 39 రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, నగర శివారు ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత బలంగా ఉందంటే, ఇటీవల జరిగిన వేలంలో ఎకరం భూమి ధర 174 కోట్లు పలికిందని ఆయన గుర్తు చేశారు.

అయితే, కేవలం సంపన్నులకే కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు కూడా సొంతింటి కల నెరవేరాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి స్పష్టం చేశారు. నగరంలో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తూనే, సామాన్యులకు అందుబాటు ధరలో ఇళ్లు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *