Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేక విచారణ బృందం విచారిస్తోంది. కేవలం కేటీఆర్‌ను మాత్రమే కాకుండా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా ఆయనతో కలిపి అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరినీ ముఖాముఖి కూర్చోబెట్టి విచారించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే రాధాకిషన్‌రావును అధికారులు విచారించగా, ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిపై నిఘా పెట్టామని ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఆ వివరాల ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్‌ను సిట్ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు.
రాధాకిషన్‌రావు చెప్పిన విషయాలు కేటీఆర్‌కు తెలుసా? లేక ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? అనే కోణంలో విచారణ సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు ట్యాప్ చేయడం, డేటాను ధ్వంసం చేయడం వంటి అంశాలపై సిట్ అధికారులు స్పష్టత కోరుతున్నారు. ఈ విచారణ తర్వాత మరిన్ని కీలక నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
