Basara

Basara: బాసరలో వసంత పంచమి వేడుకలు.. అక్షర రూపం దాల్చిన భక్తులు

Basara: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర క్షేత్రం భక్తుల సందడితో కళకళలాడుతోంది. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి జన్మదినం కావడంతో, వసంత పంచమి వేడుకలను ఆలయ అధికారులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు గోదావరి తీరానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు.

ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 1:30 గంటలకే ఆలయ తలుపులు తీసి.. సరస్వతీ దేవికి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ఘనంగా అభిషేకాలు, సుప్రభాత సేవలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వసంత పంచమి అంటేనే అక్షరాభ్యాసానికి ఎంతో పవిత్రమైన రోజు. అందుకే తమ చిన్నారులకు చదువుల తల్లి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది పిల్లలు అమ్మవారి సన్నిధిలో మొదటి అక్షరాలు దిద్దారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో అంజనాదేవి ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇబ్బంది కలగకుండా పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *