Kavitha: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ఆమె తేల్చి చెప్పారు. దీనికి గల కారణాన్ని వివరిస్తూ.. తెలంగాణ జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ఎవరైనా వచ్చి మద్దతు కోరితే ఖచ్చితంగా సహకరిస్తామని కవిత తెలిపారు. రాజకీయ అంశాలతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కూడా ఆమె స్పందించారు. ఈ కేసు విచారణ సక్రమంగా జరుగుతుందనే నమ్మకం తనకు లేదని, తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందని తాను భావించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
చివరగా, తెలంగాణ ఉద్యమకారుల గౌరవార్థం ట్యాంక్ బండ్పై వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాలని ఆమె కోరారు. ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
