Harish Rao

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ విచారణ.. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన హరీష్ రావు!

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విచారణ అంతా ఒక “సొల్లు పురాణం” అని, ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఇలాంటి డ్రామాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు.

తమకు ఉద్యమాలు, జైళ్లు, కేసులు కొత్తేమీ కాదని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో సమైక్య రాష్ట్ర పాలనలో ఇలాంటి అక్రమ కేసులు ఎన్నో ఎదుర్కొన్నామని, తాము ఎన్నడూ భయపడి పారిపోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిన నోటీసులను తాము గౌరవంగా భావిస్తున్నామని, చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. అయితే, ఉదయం ముఖ్యమంత్రి బంధువుల అక్రమాలను బయటపెట్టినందుకు కక్షగట్టి, సాయంత్రానికే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తూ.. నీకు దమ్ముంటే రాజకీయంగా పోరాడు, ఇలాంటి చిల్లర రాజకీయాలు వద్దు అని హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకుంటున్నామనే నెపంతోనే తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. విచారణ గదిలో అధికారులు అడిగిన ప్రశ్నలకు తానే ఎదురు ప్రశ్నలు వేశానని, అప్పటి డీజీపీని, ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌కు, తనకు సంబంధం ఏంటని, తాను అప్పట్లో హోం మంత్రిని కూడా కాదని హరీష్ రావు స్పష్టం చేశారు.

చివరగా, విచారణకు సంబంధించిన పూర్తి వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముక్కలు ముక్కలుగా లీకులు ఇవ్వడం కాదని, దమ్ముంటే మొత్తం నిజాలు ప్రజల ముందు ఉంచాలన్నారు. టెండర్ల విషయంలో జరుగుతున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ అక్రమ కేసులు తమను ఏమీ చేయలేవని, ఇవే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి దారి తీస్తాయని హరీష్ రావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *