Hema: టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హేమ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బ్రహ్మానందంతో కలిసి ఆమె చేసిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ప్రస్తుతం అవకాశాలు కొంత తగ్గినప్పటికీ, సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.
ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన జీవితం, కెరీర్, ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వార్తలపై ఆమె స్పష్టంగా స్పందించింది. రాజోలు వంటి చిన్న పట్టణం నుంచి, మధ్యతరగతి కుటుంబ నేపథ్యంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తాను, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని హేమ గుర్తు చేసుకుంది.
కెరీర్ ప్రారంభ దశలో అవమానాలు, నిరాకరణలు ఎదురైనప్పటికీ ఒక్కరోజు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని ఆమె తెలిపింది. తన ఆర్థిక స్థితిపై వచ్చే రూమర్లను చూసి నవ్వొస్తుందని, తనకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందన్నది కాదు, ఎవరికీ తలవంచకుండా జీవించడమే తనకు ముఖ్యమని స్పష్టం చేసింది.
రేపు సినిమాలు లేకపోయినా, జీవితం కష్టమైనా ఒక దోశల బండి పెట్టుకుని అయినా బతుకుతాను కానీ ఎవరి దగ్గర చేయి చాచనని ధైర్యంగా చెప్పింది. సమాజంలో కష్టకాలంలో ఆదుకునేవారికంటే దూరమయ్యేవారే ఎక్కువగా ఉంటారని, అయితే తన స్వభావాన్ని ఇష్టపడే వారు తనను ఆడపడుచులా గౌరవిస్తారని హేమ భావోద్వేగంగా వెల్లడించింది.
ఆత్మగౌరవం, స్వతంత్రతే తన జీవితానికి మూలమని చెప్పిన హేమ వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
