Crime News: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్‌లో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్నతల్లిపైనే కొడుకు కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు గంజాయి మత్తు, కుటుంబ గొడవలే ప్రధాన కారణమని తెలుస్తోంది. తన తల్లికి వేరొక వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు తన తల్లి రజినీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భావిస్తున్న వ్యక్తిని పక్కా ప్లాన్‌తో ఇంటికి పిలిచాడు. వారందరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్న కొడుకు, సదరు వ్యక్తితో గొడవకు దిగి అతడిని చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గొడవను ఆపేందుకు తల్లి రజినీ అడ్డు రాగా, కోపంతో ఊగిపోయిన కొడుకు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
తీవ్ర గాయాలపాలైన రజినీని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడితో పాటు ఈ గొడవలో సంబంధం ఉన్న మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
