Chandrababu Naidu

Chandrababu Naidu: నేను జ్యూరిచ్‌కి 1995 నుంచి వస్తున్నా..

Chandrababu Naidu: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు ఎన్ఆర్ఐల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. 1995లో తాను మొదటిసారి జ్యూరిచ్ వచ్చినప్పుడు ఇక్కడ తెలుగువారు ఎవరూ లేరని, కానీ నేడు స్విట్జర్లాండ్, ఐర్లాండ్‌లో వేలమంది తెలుగువారు ఉండటం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. విదేశాల్లో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకుండా కొనసాగిస్తున్న తెలుగు వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని ఆయన కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి జైత్రయాత్ర తాము గతంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే నేడు ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగు వారు స్థిరపడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో 40 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం సంపాదిస్తున్నది మనవాళ్లేనని గర్వంగా చెప్పారు. “జాబ్ చేయడం కాదు.. జాబ్ ఇచ్చే స్థాయికి ఎదగాలి” అన్న తన పిలుపును నిజం చేస్తూ పెమ్మసాని వంటి వారు అమెరికాలో ఐటీ కంపెనీలు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారని ఉదహరించారు.

ఏపీలో అభివృద్ధి విప్లవం: గ్రీన్ హైడ్రోజన్ నుంచి డ్రోన్ సిటీ వరకు గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఒక నెంబర్ వన్ బ్రాండ్‌గా మార్చామని, ఇందుకోసం 25 కొత్త విధానాలను (పాలసీలను) తెచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని, విశాఖకు వేల కోట్ల పెట్టుబడులు క్యూ కడుతున్నాయని చెప్పారు.

  • గ్రీన్ హైడ్రోజన్: ఏపీ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా మారింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం.
  • స్పేస్ & డ్రోన్ సిటీ: తిరుపతిలో స్పేస్ సిటీ, ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ఏర్పాటు చేశాం. 2026 నాటికి రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలు, డ్రోన్ అంబులెన్స్‌లు రాబోతున్నాయి.
  • వాట్సాప్ గవర్నెన్స్: 800 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందిస్తున్నాం.

ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ నినాదంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు 50 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆలోచనలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు.

జన్మభూమిని మర్చిపోవద్దు ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని (జన్మభూమి), పని చేసే చోటుని (కర్మభూమి) మర్చిపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని ఎన్ఆర్ఐలకు హితవు పలికారు. పేద విద్యార్థులు ప్రపంచంలోని బెస్ట్ యూనివర్సిటీల్లో చదవాలనే కోరిక ఉంటే, వారిని చదివించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ ఎలాగైతే చరిత్రను తిరగరాశారో, మన యువత కూడా అదే స్థాయిలో రాణించి 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *