Kerala: ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యం నడుస్తున్నది. రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఈ మోజులో పడిన యువత మంచి చెడు విచక్షణను మరిచింది. వీడియో తీయడం, సోషల్ మీడియాలో పెట్టడం.. అది మంచికి దారి తీస్తుందా? చెడుకు దారితీస్తుందా? అన్న మీమాంస ఎవరికీ తెలియదు. కానీ, తాము ఓ వీడియో పెట్టాం.. తాము చెప్పదల్చుకున్నది చెప్పేశాం.. అని ఎంత పడితే అంత.. ఏది పడితే అది.. మాట్లాడేస్తున్నారు.
Kerala: ఇక్కడ కూడా ఆ రీల్స్ పిచ్చికి ఓ నిండు ప్రాణం బలైంది. అది నిజమా.. యాదృచ్ఛికమో కానీ.. ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకున్నది. కోజికోడ్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్ (42) అనే వ్యక్తి జనవరి 16న అక్కడి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. నిల్చొని ప్రయాణిస్తున్న అతను మరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ శిమ్జిత అనే ఓ మహిళ తాను తీసిన వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
Kerala: ప్రయాణికుల రద్దీ కారణంగా బస్సులో ఓ మహిళ శరీరాన్ని దీపక్ తన మోచేతితో తాకినట్టుగా ఆ వీడియో కనిపించింది. ఈ వీడియో వైరల్‌గా మారి 25 లక్షలకు పైగా వ్యూస్‌కు చేరింది. ఈ వీడియో చూసిన దీపక్, అతని కుటుంబ సభ్యులు బాధపడ్డారు. మనస్తాపానికి గురైన దీపక్‌కు అతని కుటుంబ సభ్యులు ధైర్యం నూరిపోశారు. అయినా తన పరువు పోయిందని భావించిన దీపక్ తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Kerala: దీంతో శిమ్జిత పెట్టిన పోస్టు కారణంగానే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, కాదు.. దీపక్ వాస్తవంగా ఆ మహిళను తాకాడని, ఆమె అసౌకర్యానికి గురైన విషయాన్ని గమనించిన తాను ఆ వీడియో తీశానని శిమ్జిత చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని తాను భావించలేదని ఆమె బాధను వ్యక్తంచేశారు. ఏదైతేనేమి.. రద్దీ వల్ల జరిగిందో.. ఉద్దేశపూర్వకంగా జరిగిందో కానీ.. ఆమె అత్యుత్సాహంతో తీసిన వీడియో మాత్రం ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నది.
