Mumbai: మహారాష్ట్ర ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ (నవంబర్ 20న) ఒకే దశలో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 58.22% ఓటింగ్ నమోదైంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గడ్చిరోలిలో అత్యధికంగా 69.63%, ముంబై నగరంలో అత్యల్పంగా 49.07% ఓటింగ్ నమోదైంది. నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) అవసరం.
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడి కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఏక్నాథ్ షిండే), మన్సే, ఆర్పీఐ సహా 8 పార్టీలు ఉండగా.. మహావికాస్ అఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ థాక్రే) సహా పలు పార్టీలు ఉన్నాయి.
ఝార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలు ముగిసే సరికి 67.59 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ నేహా అరోరా తెలిపారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. ఈనెల 13న జరిగిన తొలి విడతలో కూడా భారీగానే ఓటింగ్ నమోదైంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నవంబర్ 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.
మిగతా 38 స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. ముఖ్యంగా ఇండియా కూటమి -ఎన్డీఏ (NDA) కూటమి అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇక సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్‌పోల్స్ విడుదల కానున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఝార్ఖండ్‌లో పోలింగ్ శాతం 2.75కు పెరిగింది.
మారోవైపు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో తమ పార్టీ ప్రతినిధులు ఎవరూ పాల్గొనకూడదని పేర్కొంది.

