Nara lokesh: పండగపూట ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేశ్

Nara lokesh: భోగి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. గత 81 రోజులుగా కొనసాగుతున్న ప్రజాదర్బార్‌కు ఈ రోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రజాదర్బార్‌లో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ అన్యాయాలు, పాలనా & మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. వారసత్వ భూములను ఇతరులు అక్రమంగా కబ్జా చేశారన్న పలు ఫిర్యాదులు వెలువడ్డాయి. భూ రిజిస్ట్రేషన్, హక్కుల ధృవీకరణ ఆన్‌లైన్ ప్రక్రియలతో ఇబ్బంది పడుతున్నామని రైతులు వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ప్రజలు ప్రత్యేక సమస్యలను ప్రస్తావించారు. తిరుమలలో అంగప్రదక్షణ కోసం ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్ టోకెన్ విధానాన్ని రద్దు చేసి, పూర్వంలా ఆఫ్‌లైన్ టోకెన్లు జారీ చేయాలని భక్తులు కోరారు. అలాగే టీటీడీలో సొసైటీ ఆధారంగా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వైద్య సేవలు, దర్శనం హక్కులను ఇతర ఉద్యోగులతో సమానంగా కల్పించాలని సిబ్బంది వినతులు సమర్పించారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన పలు కాంట్రాక్ట్ సూపర్వైజర్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు తమ పరిస్థితిని వివరించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగించిన 160 మంది సూపర్వైజర్లకు తిరిగి ఉద్యోగావకాశం కల్పించాలని సంఘ ప్రతినిధులు అభ్యర్థించారు.

సామాజిక వర్గాల నుంచి కూడా పలు విజ్ఞప్తులు వచ్చాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేపట్టే 150 ఎస్టీ ఎరుకల కుటుంబాలకు ఏకగ్రీవంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. చిత్తూరు జిల్లాలోని గ్రామాల నుంచి దళితులకు ఇళ్ల స్థలాలు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి వంటి స్థానిక సమస్యలను ప్రజలు తెలియజేశారు.

అందిన ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విన్న నారా లోకేశ్ సంబంధిత అధికారులతో మాట్లాడి వీటిపై త్వరితగతిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. సంక్రాంతి పండుగఉత్సాహం మధ్య ప్రజలకు చేరువగా సాగిన ఈ కార్యక్రమం, మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజలు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మరోసారి రుజువు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *