Kite Festival

Kite Festival: కన్నుల పండుగగా కైట్ ఫెస్టివల్.. ఆకాశంలో విదేశీ పతంగుల విన్యాసాలు!

Kite Festival: హైదరాబాద్ ఆకాశం రంగురంగుల హరివిల్లులా మారిపోయింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకను చూసేందుకు నగర ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రకరకాల ఆకృతుల్లో ఉన్న గాలిపటాలు ఆకాశంలో విహరిస్తుంటే, పరేడ్ గ్రౌండ్ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.

ఈ వేడుకలో ప్రపంచ దేశాల నైపుణ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రష్యా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌తో పాటు సుమారు 19 దేశాల నుండి 40 మంది నిపుణులు ఇక్కడికి వచ్చారు. వీరితో పాటు మన దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. డాల్ఫిన్లు, డ్రాగన్లు, కార్టూన్ బొమ్మల ఆకారంలో ఉన్న భారీ పతంగులు ఆకాశంలో ఎగురుతుంటే పిల్లలు, పెద్దలు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.

కేవలం పతంగులే కాదు, నోరూరించే మిఠాయిలు కూడా ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివిధ రాష్ట్రాల సంప్రదాయ స్వీట్ల స్టాల్స్ సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఇక ముందు ముందు మరిన్ని వినోద కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, అలాగే గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి వేదికగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *