Delhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వం

Delhi: దేశంలో క్విక్ డెలివరీ సర్వీసులపై పెద్ద మార్పు రాబోతోంది. 10 నిమిషాల్లో గ్రోసరీలు, ఆహారం అందిస్తామని చెప్పే విధానాన్ని కంపెనీలు నిలిపివేయనున్నాయి. డెలివరీ పార్ట్‌నర్ల భద్రతపై పెరిగిన చర్చల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. డెలివరీ సిబ్బంది మీద పడుతున్న టైమ్ ఒత్తిడి రోడ్లపై ప్రమాదాలకు దారితీస్తుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ సమయాన్ని లక్ష్యంగా పెట్టి సిబ్బందిని ఒత్తిడి చేయకుండా ఉండాలని కంపెనీలను సూచించారు.

మంత్రి సూచనలకు క్విక్ కామర్స్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. తమ ప్రకటనల్లో, యాప్ బ్రాండింగ్‌లో ఇకపై 10 నిమిషాల డెలివరీ హామీ చూపించబోమని అవి హామీ ఇచ్చాయి. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బ్లింకిట్ ట్యాగ్‌లైన్ మార్చేసింది. “10 నిమిషాల్లో డెలివరీ” అనే వాక్యానికి బదులుగా “30,000కు పైగా ఉత్పత్తులు మీ ఇంటికే” అనే కొత్త నినాదం జోడించింది.

గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా 10 నిమిషాల డెలివరీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గిగ్ వర్కర్ యూనియన్లు, ముఖ్యంగా IFAT వంటి సంస్థలు, డెలివరీ సిబ్బంది వేతనాలు, భద్రత, ఒత్తిడి అంశాలను లేవనెత్తుతూ నిరసనలు నిర్వహించాయి. దీనివల్ల ప్రభుత్వ జోక్యం అవసరమైంది. త్వరలో జెప్టో, స్విగ్గీ, జొమాటో కూడా ఇదే దారిలో మార్పులు తీసుకురానున్నాయని తెలుస్తోంది.

ఈ నిర్ణయం ద్వారా వేగం కన్నా సిబ్బంది రక్షణ, సేవల నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లకు ఆర్డర్ కొంచెం లేట్ కావచ్చు కానీ డెలివరీ బాయ్స్‌కి ఇది పెద్ద ఉపశమనం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *