Kasibugga: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. కొద్ది నెలల క్రితమే తొక్కిసలాట ఘటనతో విషాదం నింపిన ఈ ఆలయంలో, ఇప్పుడు భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. దుండగులు పక్కా ప్లాన్‌తో ఆలయంలోని విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించారు.
అర్ధరాత్రి పక్కా స్కెచ్..
గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం వెనుక ద్వారం నుంచి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు దుండగులు అత్యంత చాకచక్యంగా సిసి కెమెరా వైర్లను కట్ చేశారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారి బంగారు నగలు, హుండీలను ఎత్తుకెళ్లారు. ఆలయ ధర్మకర్త సమాచారం మేరకు సుమారు 60 లక్షల రూపాయల విలువైన సొత్తు పోయిందని తెలుస్తోంది. అయితే మరికొన్ని ఆధారాల ప్రకారం ఇది కనీసం 10 లక్షల పైమాటే అని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Traffic Rush: భోగికి ముందే రోడ్లపై సెగలు.. విజయవాడ హైవేపై వాహనాల వెల్లువ!
ఈ ఆలయంలో గత నవంబర్ 1వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేసి, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అప్పటి నుంచి అక్కడ పోలీసు పికెట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే దురదృష్టవశాత్తు కొద్ది రోజుల క్రితమే పోలీసులు ఆ పికెట్‌ను ఎత్తివేయడం, అదే సమయంలో ఈ చోరీ జరగడం గమనార్హం.
విషయం తెలిసిన వెంటనే కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, సీఐ రామకృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు అటు భక్తులను, ఇటు స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
