Atreyapuram: కోనసీమ పేరు చెప్పగానే పచ్చని ప్రకృతి, గోదావరి పరవళ్లు గుర్తొస్తాయి. ప్రస్తుతం సంక్రాంతి పండుగ కావడంతో ఈ ప్రాంతం మరింత శోభను సంతరించుకుంది. ముఖ్యంగా ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ’ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు పడవల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఈ సంబరాల్లో భాగంగా మొదటి రోజు నిర్వహించిన ఈత పోటీలు, ముగ్గుల పోటీలు మరియు ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రెండో రోజు అసలైన మజా మొదలైంది. నీటిపై పక్షుల్లా దూసుకుపోయే డ్రాగన్ పడవల పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు అధికారులతో కలిసి ప్రారంభించారు. గోదావరి అలలపై పడవలు పోటీ పడుతుంటే చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదని స్థానికులు సంబరపడుతున్నారు.
ఈ పోటీల ప్రత్యేకత ఏమిటంటే, కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు 250 మంది క్రీడాకారులు ఇక్కడికి తరలివచ్చారు. మన ఊరిలో ఇంత పెద్ద ఎత్తున జాతీయ స్థాయి క్రీడాకారులు పోటీ పడటం విశేషం. పక్కనే ఉన్న ఊర్ల నుండి కూడా వేల సంఖ్యలో ప్రజలు రావడంతో ఆత్రేయపురం మొత్తం ఒక పెద్ద తిరునాళ్లలా మారిపోయింది.
ప్రభుత్వం ఇలాంటి వినూత్నమైన పోటీలను నిర్వహించడం వల్ల మన సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు పూతరేకుల తీపి, ఇటు గోదావరి గాలి, మధ్యలో ఈ పడవల పోటీలు వెరసి ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి ఓ రేంజ్లో కనిపిస్తోంది.
