Gujarat Investment: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ, భారతదేశం మాత్రం అభివృద్ధి పథంలో బలంగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మన దేశంపై పడకుండా జాగ్రత్త పడడమే దీనికి కారణమని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ప్రశంసించారు. రానున్న పదేళ్లు భారతదేశానికి ఎంతో కీలకం కానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే రిలయన్స్ గ్రూప్ గుజరాత్లో తన పెట్టుబడులను భారీగా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు అంబానీ ప్రకటించారు. ముఖ్యంగా జామ్‌నగర్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు.. ఒకవైపు చలి.. మరోవైపు వర్షం!
దీనితో పాటు గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ వంటి భవిష్యత్తు ఇంధన వనరుల రంగంలో భారత్‌ను ప్రపంచ దేశాల ముందు నిలపడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కేవలం పరిశ్రమలే కాకుండా, క్రీడారంగంపై కూడా దృష్టి సారించిన రిలయన్స్ ఫౌండేషన్, 2036 ఒలింపిక్స్‌కు మద్దతుగా గుజరాత్ ప్రభుత్వంతో కలిసి మల్టీ-స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణలో భాగస్వామి కానుంది.
మరోవైపు అదానీ గ్రూప్ కూడా గుజరాత్లో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఐదేళ్లలో కచ్ ప్రాంతంలో దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ వెల్లడించారు. 2030 నాటికి ఖవ్డా ప్రాజెక్టు ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా, ముంద్రా పోర్ట్ సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేయనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో వేలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇలా దేశంలోని ఇద్దరు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడంతో గుజరాత్ ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది.
