Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా కాస్త శాంతించిన పసిడి ధరలు మళ్లీ ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ పరిణామాల వల్ల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు గ్రాము బంగారం కొనాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ధరల పెరుగుదల భారీగా ఉంది.
ఆదివారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే తులం బంగారంపై వెయ్యి రూపాయలకు పైగా పెరగడం విశేషం. హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,40,460 కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ.1,40,610 గా ఉంది.
వెండి ధరలు అయితే ఊహించని రీతిలో పెరిగిపోయాయి. నిన్న ఒక్క రోజులోనే కిలో వెండిపై సుమారు 11 వేల రూపాయల వరకు భారం పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,75,000 కు చేరుకుంది. ఇతర ప్రధాన నగరాల్లో ఇది రూ.2,60,000 లుగా ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధర భారీగా ఉండటం గమనార్హం.
మహిళలు ఎంతో ఇష్టపడే బంగారం ధరలు ఇలా పరుగులు పెడుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవి ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు మాత్రమే. మార్కెట్ ఒడిదుడుకులను బట్టి రోజంతా ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానిక నగల దుకాణాల్లో ధరలను సరిచూసుకోవడం మంచిది.
