Tollywood: సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న రెండు టాలీవుడ్ సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి తెలిపింది. జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్న రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, జనవరి 14న విడుదల కాబోయే నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలకు ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక మెమోను రిలీజ్ చేసింది.
ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ మరియు చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు టికెట్ ధరల పెంపు, అదనపు షోలు మరియు ప్రీమియర్‌లకు అనుమతులు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి రేసులోకి వస్తున్న రవితేజ, నవీన్ పోలిశెట్టి చిత్రాలకు కూడా ఇదే విధంగా సదుపాయాలు కల్పించడంపై ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
అధికారుల ప్రకారం, వచ్చే పది రోజులపాటు ఈ రెండు సినిమాల టికెట్ ధరలను పెంచుకునే అవకాశం థియేటర్లకు లభిస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా వసూలు చేయవచ్చని తెలిపారు. ఈ మొత్తంలో జీఎస్టీ కూడా కలిపి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే అవసరమైతే అదనపు షోలను కూడా ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటిస్తుండగా, కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు సరిపోయేలా ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించి తెరకెక్కించాడు.
‘అనగనగా ఒక రాజు’లో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా కనిపిస్తారు. మారి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్ యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిందనేది పరిశ్రమ అంచనా.
