Rishabh Pant: అట్టిపెట్టుకునేందుకు ఫ్రాంఛైజీ ఇవ్వజూపిన ఫీజు విషయంలో భిన్నాభిప్రాయాలు వల్లే దిల్లీ క్యాపిటిల్స్ను వీడాడన్న సునీల్ గావస్కర్ వ్యాఖ్యల్ని భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ తోసిపుచ్చాడు. దిల్లీ జట్టులో కొనసాగకపోవడానికి డబ్బు కారణం కాదని తెలిపాడు. “నన్ను అట్టిపెట్టుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా చెప్పగలను” అని ఎక్స్ వేదికగా పంత్ స్పందించాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్నాక ఈ ఏడాది దిల్లీ సారథిగా పునరాగమనం చేసిన పంత్.. ఆటగాళ్ల మెగా వేలంలో తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే ఐపీఎల్ వేలంలో పంత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు.
