Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో కృష్ణా జలాల పంపిణీ అంశం మరోసారి చిచ్చురేపింది. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లోని రేకుర్తిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నీళ్ల పేరుతో సాగుతున్న పొలిటికల్ డ్రామాలను ఎండగట్టారు. కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పులు, బీఆర్ఎస్ చేసిన అవినీతి పాపాలు నేడు తెలంగాణ ప్రజలకు శాపాలుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన చట్టం నుంచి ప్రాజెక్టుల దాకా.. అంతా వంచనే!
తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం చేసిన మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీయేనని బండి సంజయ్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాల వాటా 811 టీఎంసీలు ఉంటే, తెలంగాణకు ఏనాడూ 200 టీఎంసీలకు మించి అందకుండా కాంగ్రెస్ అడ్డుపడిందని ధ్వజమెత్తారు. అలాగే ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల జాబితాలో ఏపీకి చెందిన 4 ప్రాజెక్టులను చేర్చి, తెలంగాణకు చెందిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు చేర్చలేదని ఆయన నిలదీశారు. ఆనాడు అధికారంలో ఉండి కూడా తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ నేతలు తాకట్టు పెట్టారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: NATS: ‘భాషే రమ్యం – సేవే గమ్యం’ నినాదంతో నాట్స్ సేవా బాట!
కేసీఆర్ దోపిడీ.. కాళేశ్వరం కాదు ‘కూలేశ్వరం’
బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారని సంజయ్ మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 4.3 టీఎంసీల నుండి 13.7 టీఎంసీలకు పెంచినా కేసీఆర్ నోరు మెదపలేదని విమర్శించారు. కేవలం కమిషన్ల కోసమే రూ. 30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచి ‘కాళేశ్వరాన్ని’ కాస్త ‘కూలేశ్వరం’గా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ భారీ అవినీతికి పాల్పడ్డారని, పాలమూరు రంగారెడ్డి విషయంలో నాటి కేసీఆర్ మెడలు వంచి ఉద్యమాలు చేసింది కేవలం బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
అధికార, ప్రతిపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా ఉండేందుకు, అలాగే బీఆర్ఎస్ చేసిన అవినీతిపై విచారణ జరగకుండా ఉండేందుకు ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరగొద్దని కేంద్రమే అనేక సమావేశాలు పెట్టి పరిష్కార మార్గాలను చూపిస్తోందని గుర్తుచేశారు. తెలంగాణ హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, దోషులను ప్రజల ముందు నిలబెడతామని ఆయన హెచ్చరించారు.
