YS Jagan: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తానే స్వయంగా అడ్డుకున్నానని రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటున్నారని, దీనిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని జగన్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు చెన్నైకి కూడా తాగునీరు అందించే ఒక ‘సంజీవని’ లాంటిదని ఆయన అభివర్ణించారు. కరువుతో అల్లాడే సీమ ప్రాంతానికి ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ వంటిదని, అలాంటి ప్రాజెక్టును ఆపేయడం ద్వారా చంద్రబాబు తన సొంత ప్రాంతానికే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య కుదిరిన రహస్య ఒప్పందాల వల్లే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని జగన్ విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతారని, గతంలో మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనదని, ఇప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పడే రాయలసీమ ప్రజలకు కూడా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్న మాటలు రాక్షసత్వానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. రాయలసీమకు న్యాయం జరగాలంటే ఈ ప్రాజెక్టు అత్యవసరమని, దీనిపై వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం తన రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తెలంగాణ సీఎంకు అమ్మకానికి పెట్టారని జగన్ ఘాటుగా విమర్శించారు.
