Crime News: వివాహేతర సంబంధాలు ఏ స్థాయి దారుణాలకు దారితీస్తాయో చెప్పడానికి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోర్గాం(కే) గ్రామంలో జరిగిన ఘటనే నిదర్శనం. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో ఒక భార్య తన భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించింది. ఈ హత్యను సహజ మరణంగా నమ్మించాలని చూసినా, చివరకు ఒక చిన్న ఆధారం పోలీసుల విచారణలో ఈ భయంకరమైన కుట్రను బయటపెట్టింది.
అక్రమ సంబంధం.. అడ్డు తొలగించుకునే ప్లాన్
మృతుడు పల్లాటి రమేష్(35) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, అతని భార్య సౌమ్య ఒక ప్రైవేట్ స్కూల్‌లో క్లర్క్‌గా పనిచేసేది. అదే స్కూల్‌లో పీఈటీగా పనిచేసే దిలీప్‌తో సౌమ్యకు ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన రమేష్ భార్యను మందలించడంతో, అతడిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సౌమ్య నిర్ణయించుకుంది. దీనికి తోడు రమేష్ పేరు మీద ఉన్న రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులపై సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్ కన్నేశారు. ఆ డబ్బుతో విదేశాలకు పారిపోయి హాయిగా బతకాలని స్కెచ్ వేశారు.
విఫలమైన మొదటి ప్రయత్నం.. సుపారీ గ్యాంగ్‌తో డీల్
రమేష్‌ను చంపడానికి వీరు తొలుత రోడ్డు ప్రమాదాన్ని సృష్టించారు. గత ఆగస్టు 12న కారుతో రమేష్ బైక్‌ను ఢీకొట్టించి హత్య చేయాలని చూశారు. కానీ ఆ ప్రమాదంలో రమేష్ కేవలం చేయి విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఈసారి ఎలాగైనా పని ముగించాలని ఒక సుపారీ గ్యాంగ్‌ను రూ. 35 వేలకు మాట్లాడుకున్నారు. ఈ డబ్బు కోసం సౌమ్య తన బంగారు ఉంగరాన్ని తాకట్టు పెట్టి ప్రియుడికి నగదు సమకూర్చడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Wipro: విప్రో ఉద్యోగులకు భారీ షాక్.. రూల్స్ పాటించాల్సిందే.. లేదంటే లీవ్స్ కట్!
గుండెపోటుగా నమ్మించి.. గొంతు నులిమి హత్య
డిసెంబర్ 19 రాత్రి అసలు కుట్ర అమలు జరిగింది. రమేష్‌కు అన్నంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన సౌమ్య, అతను గాఢ నిద్రలోకి జారుకున్నాక ప్రియుడు దిలీప్, అతని అనుచరుడు అభిషేక్‌లను ఇంటికి పిలిపించింది. నిద్రలో ఉన్న రమేష్ ముఖంపై దిండు అదిమి, మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం రమేష్ గుండెపోటుతో మరణించాడని బంధువులను నమ్మించి హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేసింది.
తమ్ముడి అనుమానం.. బయటపడ్డ అసలు రంగు
అయితే, ఇజ్రాయెల్‌లో ఉంటున్న రమేష్ తమ్ముడు కేదారికి పంపిన అంత్యక్రియల ఫోటోలు, వీడియోలే ఈ కేసులో కీలక మలుపు తిప్పాయి. ఫోటోలలో రమేష్ మెడపై గాయాలను గమనించిన కేదారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 24న పోలీసులు తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి రీ-పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు నిజం బయటపడింది. అది సహజ మరణం కాదని, ఊపిరాడక జరిగిందని తేలడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా సౌమ్య, దిలీప్ తమ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం సౌమ్యతో పాటు ఆమె ప్రియుడు మరియు సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
