KTR

KTR: తెలంగాణలో ప్రస్తుతం ‘రాబందుల కాలం’ నడుస్తోంది..

KTR: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు కల్వకుంట్ల కుటుంబంపైనే ఉన్నాయి. మొన్న శాసనమండలిలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆత్మవిమర్శ లాంటి వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించగా, తాజాగా జనగామ వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ గొడవలను పరోక్షంగా అంగీకరిస్తూనే కేడర్‌కు గట్టి సంకేతాలిచ్చారు. ఏ కుటుంబంలోనైనా గొడవలు ఉండటం సహజమని, అలుగుడు-గులుగుడు ఉన్నా అందరూ సర్దుకుపోవాలని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మనం ఐక్యంగా లేకపోతే కాంగ్రెస్, బీజేపీ నేతలకు సందు దొరుకుతుందని ఆయన అప్రమత్తం చేశారు.

కేటీఆర్ తన జనగామ పర్యటనలో కేవలం ఇంటి గొడవలకే పరిమితం కాకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రస్తుతం ‘రాబందుల కాలం’ నడుస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రికి పాలనపై ఓనమాలు తెలియవని, కేవలం మూటలు మోయడమే ఆయనకు తెలుసని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి:  Chennai: నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, రైతులు మళ్లీ యూరియా కోసం చలిలో గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఇంటింటికీ నీళ్లు ఇచ్చి, రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతను ఆదుకుంటే, నేడు రేవంత్ సర్కార్ రైతులను అగమ్యగోచరంలోకి నెట్టిందని విమర్శించారు.

మరోవైపు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలను కేటీఆర్ తప్పుబట్టారు. ప్రస్తుతం శాసనసభ గౌరవ సభలా లేదని, కౌరవ సభను తలపిస్తోందని విమర్శించారు. కేసీఆర్ కేవలం ప్రెస్ మీట్ పెడితేనే తట్టుకోలేని రేవంత్ రెడ్డి, రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Road Accident: అమెరికాలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి

మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల నగదు, బతుకమ్మ చీరలు ఇవ్వలేని ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనడం పెద్ద మోసమని దుయ్యబట్టారు. 70 లక్షల మంది రైతులను వంచించిన రాహుల్ గాంధీని ఉరితీయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

మొత్తానికి, అటు ఇంటిపోరును సర్దుబాటు చేసుకుంటూనే, ఇటు ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడటం ద్వారా కేటీఆర్ అటు కుటుంబంలోనూ, ఇటు పార్టీలోనూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అపారమైన అనుభవం ఉన్న కేసీఆర్‌కు పాఠాలు చెప్పాలని చూడటం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *