Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరో అంతర్జాతీయ హెచ్చరిక జారీ చేశారు. ఈసారి ఆయన గురి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌పై పడింది. అగ్రరాజ్యం నిర్దేశించిన మార్గంలో నడవకపోతే ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ అత్యంత కఠిన పదజాలంతో హెచ్చరించారు. నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత బాధ్యతలు చేపట్టిన డెల్సీకి, మునుపటి అధ్యక్షుడి కంటే ఘోరమైన పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వెనిజులాలో విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవన ప్రమాణాలను పునర్నిర్మించాలంటే తమ నియంత్రణకు లోబడి ఉండాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. తొలుత డెల్సీ సహకరిస్తుందని భావించినప్పటికీ, బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె అమెరికా చర్యలను తప్పుబట్టడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా మదురో నిర్బంధాన్ని ఆమె విమర్శించడాన్ని అమెరికా సహించబోమని ఆయన తేల్చి చెప్పారు. తాము కోరుకున్నట్లుగా వ్యవహరిస్తే వెనిజులాలో బలగాలను మోహరించే అవసరం ఉండదని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: USA: అమెరికాలో తెలుగు యువతి నికిత రావు దారుణ హత్య!
మరోవైపు, డెల్సీ రోడ్రిగ్జ్ ఈ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తూనే తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేలా స్పందించారు. అమెరికాతో సహా అన్ని దేశాలతో మర్యాదపూర్వకమైన, సమతుల్యమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. వెలుపలి నుంచి ఎటువంటి ముప్పులు లేకుండా, అంతర్జాతీయ సహకారంతో శాంతియుతంగా జీవించాలని వెనిజులా ఆశిస్తోందని ఆమె పేర్కొన్నారు. తమ దేశ పురోగతి కోసం అమెరికా ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆహ్వానించారు.
అమెరికా పెత్తనాన్ని అంగీకరించాలని ట్రంప్ డిమాండ్ చేస్తుంటే, ఆత్మగౌరవంతో కూడిన సహకారం కావాలని డెల్సీ కోరుతున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న ఈ భీకర పోరు వెనిజులా భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందోనన్న ఉత్కంఠ అంతర్జాతీయ వేదికపై కనిపిస్తోంది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో వెనిజులాలో రాజకీయ పరిణామాలు ఏ క్షణమైనా మారే అవకాశం ఉంది.
