Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సిట్ (SIT) అధికారులు తమ విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు అధికారులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో నవీన్ రావు పాత్రపై సిట్ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక పరికరాల సహాయంతో కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేయించారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఎవరి ఆదేశాల మేరకు ఇది జరిగింది? అనే కోణంలో పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో వెల్లడయ్యే అంశాలు కేసును మరో మలుపు తిప్పే అవకాశం ఉంది.
మరోవైపు, ఈ కేసు కేవలం ఒకరిద్దరితో ఆగిపోయేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉండగా, ఇప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
