Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అత్యంత పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనాలు శ్రీవారి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే సుమారు 3.74 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. నేడు ఆరో రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదమని భావించి, దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే, టోకెన్లు లేని భక్తులను కూడా అనుమతించడంతో క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. చలిని కూడా లెక్కచేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, గంటల తరబడి వేచి ఉండే వారికి అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు వంటి సదుపాయాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు, తిరుమలలో నేడు ఒక విశిష్ట ఉత్సవం జరగనుంది. సాయంత్రం శ్రీవారి ఆలయంలో వార్షిక ‘ప్రణయ కలహ మహోత్సవం’ నిర్వహించనున్నారు. స్వామివారు, అమ్మవార్ల మధ్య జరిగే ఈ చమత్కారభరితమైన ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 88,662 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 24,417 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లు రావడం విశేషం.
