Naa Anveshana: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ నా అన్వేషణ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. తన వీడియోల ద్వారా ప్రపంచాన్ని చూపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్, ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయన తన ఛానల్‌లో పెడుతున్న కొన్ని వీడియోలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, మహిళలను తక్కువ చేసి వస్తువుల్లా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి.
మహిళా సంఘాలు చేసిన ఫిర్యాదుల ప్రకారం.. అన్వేష్ తన వీడియోలలో మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వారిని అవమానించేలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, కొన్ని వీడియోలలో చిన్న పిల్లల హక్కులకు భంగం కలిగేలా, చట్టవిరుద్ధమైన అంశాలు కూడా ఉన్నాయని మహిళా కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. ఇది కేవలం మహిళలకే కాకుండా, సమాజంలోని నైతిక విలువలకే ముప్పు అని కమిషన్ భావిస్తోంది.
మరోవైపు, హిందూ దేవతలపై కూడా అన్వేష్ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలు సామాజిక శాంతికి విఘాతం కలిగిస్తాయని మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం అన్వేష్ భారతదేశంలో లేకపోవడం, విదేశాల్లో నివసిస్తుండటంతో ఈ కేసును తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ కు బదిలీ చేసింది.
నిందితుడు విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకునే అధికారం జాతీయ కమిషన్‌కు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అన్వేష్‌కు సంబంధించిన వీడియో ఆధారాలను, సోషల్ మీడియా లింకులను సేకరించి కేంద్ర అధికారులకు పంపారు. మహిళల గౌరవాన్ని కాపాడటంలో రాజీ పడకూడదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిషన్ కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో “నా అన్వేషణ” ఛానల్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
