Grok: ఎలోన్ మస్క్ సారథ్యంలోని xAI సంస్థ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ‘గ్రోక్’ (Grok) ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సమాజానికి మేలు చేసే సాంకేతికతగా పరిచయమైన ఈ ఏఐ సాధనాన్ని కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేస్తూ అశ్లీల కంటెంట్ సృష్టిస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు, ప్రముఖుల ఫోటోలను గ్రోక్‌కు అందిస్తూ, వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్చాలని ప్రాంప్టింగ్ ఇస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలా ఏఐ ద్వారా సృష్టించిన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా, పోర్న్ సైట్లలో కూడా అప్‌లోడ్ చేస్తుండటంతో అమాయక మహిళలు, చిన్నపిల్లలు తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారు.
Also Read: Indore: ఇండోర్‌లో కలుషిత తాగునీటి విషాదం: మున్సిపల్ కమిషనర్‌పై వేటు!
నిజానికి గ్రోక్ అనేది నిజాలను శోధించే ఏఐగా, రియల్ టైమ్ సెర్చ్, కోడింగ్, విజువల్ ప్రాసెసింగ్ వంటి అద్భుతమైన సామర్థ్యాలతో రూపొందించబడింది. అయితే, ఈ సాంకేతికతను తప్పుదోవ పట్టిస్తూ అమాయకుల ఫోటోలను అసభ్యకరంగా మారుస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఏఐ నియంత్రణలో నైతికత, భద్రతా లోపాలు ఉన్నాయని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ ఉదంతం ఏఐ వినియోగంలో ఉండాల్సిన భద్రతా ప్రమాణాలపై ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది.
